Saturday, 6 April 2013

నాకు తెలిసిన కొన్ని పిలుపులు


నేను హైదరాబాదు శివారు గ్రామంలో ఉంటాను.
నాకు తెలిసిన కొన్ని పిలుపులు
అమ్మ: నేను అమ్మ అని పిలుస్తాను. ఈ మధ్య పుట్టిన పిల్లలు సహజంగానే మమ్మి అని పిలుస్తున్నారు. మా బాపు అవ్వ అని పిలుస్తడు.
నాన్న: నేను బాపు అని పిలుస్తాను. నాకు చాలా ఇష్టమైన పదం. నాకు పుట్టబోయే పిల్లలకు నన్ను బాపు అనే పిలువమంట. బాపు అనే ఈ పిలుపు ఉర్దూ నుండి వచ్చింది అనుకుంట. మా బాపు మా తాతని బాపు అనేవాడు. మా చుట్టాలు దాదాపు అందరు బాపు అనే పిలుస్తారు. మా నాయనమ్మ "నాయిన" అనేదంట."అయ్య" అనికూడ ఇక్కడ బానె పిలుస్తారు. నాన్న అని పిలిచేవారు తక్కువ. మా అమ్మమ్మ దాదా అనేదంట. ఈ మధ్య పిల్లలు డాడీ అని పిలుస్తున్నారు.
అక్క: అక్క అనే పిలుస్తారు. నేను పెద్దక్క, చిన్నక్క అని పిలుస్తా.
అన్న: అన్న అనే పిలుస్తారు.
తమ్ముడు, చెల్లిని సాధారణంగా పేరు పెట్టి పిలుస్తారు.
తాత: తాత అనే పిలుస్తారు అమ్మ తండ్రి అయిన, నాన్న తండ్రి అయినా.
అమ్మమ్మ: అమ్మమ్మ అని పిలుస్తారు.
నానమ్మ: నాయినమ్మ అని పిలుస్తాను. కొందరు బాపమ్మ అని పిలుస్తారు. మా నాయినమ్మ వాళ్ళమ్మని అవ్వ అని, వాళ్ళ నానమ్మని అమ్మ అని పిలిచేదంట.

భర్త భార్యని పేరు పెట్టి పిలుస్తాడు.
భార్య భర్తని "ఇగో(ఇదిగో)" అని పిలుస్తుంది. ఎవరికైన చెప్పాల్సివస్తే "మా ఆయన" అంటారు. ఈ మధ్య పెళ్ళి అయినవారు ఏవండి అని పిలుస్తున్నారు.

అమ్మ చెల్లిని పిన్ని, చిన్నమ్మ అని పిలుస్తారు.
అమ్మ అక్కని పెద్దమ్మ అని పిలుస్తారు.
అమ్మ తమ్ముడిని లేదా అన్నని మామ, మామయ్య అని పిలుస్తారు. ఇద్దరు ఉంటె చిన్నమామ, పెద్దమామ అని పిలుస్తారు.
నాన్న చెల్లి లేదా అక్కను అత్త, అత్తమ్మ, అత్తయ్య అని పిలుస్తారు.
నాన్న తమ్ముడిని బాబాయి, చిన్నబాపు, చిన్నాయిన అని పిలుస్తారు.
నాన్న అన్నని పెద్దబాపు, పెద్దనాయిన అని పిలుస్తారు.
దోస్తులను,చిన్నోళ్ళను అరెయ్, ఒరెయ్ అని పిలుస్తాం.
చిన్నవాళ్ళు తమకంటె నెలలు పెద్దైన అరెయ్ అని పిలువరు(పిలువనివ్వరు).

ఇంట్లొ తమ కంటె పెద్దవారిని "ఏ" అని పిలుస్తారు. ఇది కూడ నాకు చాలా ఇష్టం.
ఇలా
"అక్కా అన్నం పెట్టే"(పెట్టవే అని అనం)
"అది గాదె బాపు"
తండ్రి, తల్లి తన ఆడబిడ్డలను "ఏ" అని అనరు. ఆడబిడ్డల కొడుకులను కూడ అరెయ్, ఒరెయ్ అని అనరు. ఇది కాస్త ప్రత్యేకంగా తోస్తుంది నాకు.

అమ్మగారు, నాన్నగారు లాంటి పదాలు సాధారణంగా వాడం.
మీరు అనే పదం కేవలం స్కూళ్ళో టీచర్లను అంటాం.

అయితే ఇప్పుడు అందరు తమ కంటె పెద్దవారిని అంకుల్, ఆంటి అని పిలుస్తున్నారు:(

మనకి పేరు ఉన్నదే పిలవడానికి ఈ పిలుపులు అవసరం లేదు అని కొందరు అంటారు. అవును అందరిని "అంకుల్, ఆంటి, సారు, మేడం" అనే బదులు వాళ్ళ పేరుతోనె పిలుస్తే బాగుంటుందనుకుంట.

Note: ఈ టపా నవ్వుకోడానికి రాసింది కాదు, తెలుసుకోడానికి రాసింది. Please dont make fun of this.

No comments:

Post a Comment

Web Analytics